పుట్టిన వారు మరణించక తప్పదని భగవద్గీత ద్వారా శ్రీ కృష్ణుడు ఎప్పుడో బోధించాడు. అయితే, మన నుంచి ప్రాణాన్ని వేరు చేసేది మాత్రం యమ ధర్మరాజు అన్న సంగతి మనకు తెలిసిందే. మనలో చాలా మందికి ఆయన పట్ల భయము, భీతి ఉంటుంది. ఆయన మన ప్రాణాలను తీసుకెళ్ళిపోతాడన్న భావన కలిగి ఉంటాము. కానీ.. ఇది సృష్టిధర్మం లోని భాగం మాత్రమే. యమధర్మరాజు కూడా మన ప్రాణాలను తీసుకెళ్లే ముందు మనకు నాలుగు సంకేతాలను పంపుతారట. అవేంటో..మనం చూద్దాం..
ఆ సంకేతాలను తెలియచెప్పే కథ ఒకటి ఉంది. యమునా నదీ తీరం లో అమృతుడు అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడట. అతనికి ఎపుడు చూసినా తాను చనిపోతానేమో అని.. ఎపుడు చనిపోతానో అని ఒక దిగులు గా ఉండేదట.
ఈ విషయం లో దిగులు పోగొట్టుకోవడం కోసం యమ ధర్మ రాజుని ఉద్దేశించి తపస్సు చేసాడట. అతని తపస్సుకి మెచ్చి యమధర్మ రాజు ప్రత్యక్షం అయి ఏమి వరం కావాలో కోరుకోమన్నాడట. అయితే, ఆ వ్యక్తి తనకి మరణం ఎప్పుడు వస్తుందో ముందుగానే తెలియచేయమన్నాడట. ఆ విషయం ముందే తెలిస్తే తన బాధ్యతలన్నీ మరొకరికి అప్ప చెప్పేయాలనేది అతని ఆలోచన.
అయితే, యమధర్మ రాజు మరణం ఎప్పుడు వస్తుందో చెప్పలేనని, అయితే అందుకు గుర్తు గా కొన్ని సంకేతాలను మాత్రం పంపగలనని తెలిపాడట. వాటిని బట్టి మరణం వచ్చే విషయం తెలుసుకోవాలని యమధర్మరాజు సూచించారు. ఆ తరువాత ఈ విషయాన్నీ అమృతుడు మర్చిపోతాడు. పెళ్లి చేసుకోవడం, పిల్లలని కనడం, వారికి కూడా పెళ్లిళ్లు అవ్వడం కాలక్రమం లో జరిగిపోతుంటుంది. అయితే, ఓ రోజు అమృతుడికి యమధర్మరాజు తో జరిగిన సంభాషణ గుర్తుకు వస్తుంది.
కానీ, ఆయన చెప్పిన సూచనలు ఏవి కనిపించకపోవడం తో తనకు ఇంకా ఆయువు ఉందని అమృతుడు అనుకుంటాడు. కాలక్రమం లో అతని చర్మం ముడతలు పడుతుంది, వెంట్రుకలు తెల్లబడతాయి. పళ్ళు కూడా ఊడిపోతాయి. పక్షవాతం సోకి మంచానికే పరిమితం అవుతాడు. ఓ రోజున యమధర్మరాజు అతని ప్రాణాలు తీసుకుని పోవడానికి వస్తాడు. అయితే, అమృతుడు ఆశ్చర్యం తో నాకు సూచనలు చేస్తానని మాటిచ్చావు. కానీ, ఎలాంటి సూచనలు ఇవ్వకుండా తీసుకెళ్ళిపోతున్నావు. నువ్వు నాకిచ్చిన వరం మాటేమిటి? అని అడుగుతాడు.
నేను నీకు నాలుగు సార్లు సూచనలు చేసినప్పటికీ, నువ్వు గ్రహించలేదు అని చెబుతాడు. ఆ సూచనలేమిటని అమృతుడు యముడిని అడగ్గా, వెంట్రుకలు తెల్లబడడం, చర్మం ముడుచుకోవడం, పళ్ళు ఊడిపోవడం, పక్షవాతం వంటి అనారోగ్యాలను తానూ పంపిన సూచనలు గా యముడు వివరిస్తాడు. అప్పుడు అమృతుడుకి కి విషయం అర్ధం అవుతుంది. అమృతుడు నిజాన్ని ఒప్పుకున్నతరువాత యమధర్మరాజు అతని ప్రాణాలను తీసుకెళ్ళిపోతాడు.
Comments
Post a Comment
Thanks for having time to give a feedback to us!
Visit more in our
YouTube channel